స్వామి స్వరూపానంద ను టార్గెట్ చేసిన గరికపాటి 

వేదాంత జ్ఞానం రవ్వంతైనా లేని పీఠాధిపతులు రాజకీయ పార్టీల ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారే తప్ప.. అద్వైత స్వాములుగా కనబడటం లేదని మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు అన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఆంధ్ర పురాణకర్త, మహాకవి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి శతజయంత్యుత్సవ సభ లో గరికపాటి చేసిన వ్యాఖ్యలు సూటిగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి  స్వరూపానందేంద్ర సరస్వతి ని ఉద్దేశించి చేసినట్టు గా కనిపిస్తోందని విశ్లేషకుల అభిప్రాయం.  నవరసాలు పండించిన మహాకవి మధునాపంతుల  సభలో గరికపాటి చేసిన వ్యాఖ్యలు స్వరూపానంద ని మరో సారి వివాదాల్లోకి లాగినట్టు గానే కనిపిస్తోంది, మధునాపంతుల  కావ్యాలు ఆంధ్ర సాహిత్యంలో ప్రకంపనలు సృష్టించాయని శ్లాఘించిన గరికపాటి, హఠాత్తుగా ఆ వేదిక మీద పీఠాధిపతుల ప్రస్తావన తేవటం వెనుక జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలు, అలాగే వాటిని సమర్థిస్తున్న స్వామి స్వరూపానంద వైఖరే ప్రధాన కారణం గా కనిపిస్తోంది. 

అంతే  కాకుండా, విపక్ష తెలుగు దేశం తోనూ, మీడియా అధిపతి వేమూరు రాధ కృష్ణ తోనూ గరికపాటి కి ఉన్న సాన్నిహిత్యం కూడా ఆయన చేత ఆ రకంగా మాట్లాడించి ఉండవచ్చునని కూడా విశ్లేషకులు   అభిప్రాయపడుతున్నారు. రెండున్నర దశాబ్దాల క్రితం విశాఖ లో శారదాపీఠం ఏర్పాటు చేసుకున్న స్వామి స్వరూపానంద కు అద్వైత సంబంధ విషయాల్లో ఉన్న జ్ఞానం పరిమితమని గరికపాటి పరోక్షం గా చేసిన వ్యాఖ్యలు ఆధ్యాత్మిక రంగం తో అనుబంధం ఉన్న వారిలో ఆలోచన రేకెత్తించాయి. నిజానికి స్వామి స్వరూపానంద ఎన్నడూ ప్రవచనాలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఆయన సన్యాసాశ్రమం అంతా కూడా రాజకీయాలతో మమేకమైపోవటం ఒక ప్రధాన మైన అంశం గా ఆయన్ను దగ్గరి నుంచి చూసిన వారికి అనుభవైకేద్యమే. అయితే, స్వామి స్వరూపానంద దగ్గర ఉన్న గొప్ప లక్షణమేమిటంటే ..తన దగ్గరకు ఒక సారి వచ్చిన వారిని కుల, మతాలకు అతీతంగా అక్కున చేర్చుకోవటం. జగన్ మోహన్ రెడ్డి క్రైస్తవాన్ని కూడా అక్కున చేర్చుకుని , ఆయన చేత తన పీఠం లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కుంభాభిషేకం చేయించటం ద్వారా ఒక్క సారిగా హిందూ ధార్మిక వ్యవస్థల దృష్టిని ఆకర్షించిన స్వామి స్వరూపానంద, ఆ క్రమం లో విపరీతమైన విమర్శలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. 

అయితే, దివంగత కాంగ్రెస్ మంత్రి, పూర్వ రాజ్య సభ్యుడు అయిన ద్రోణం రాజు సత్యనారాయణ ఒంట  పట్టించిన రాజకీయ ఎత్తుగడలు , స్వామి స్వరూపానంద ను రాటుతేలేలా చేశాయి. ఆ  తర్వాత,విశాఖ కె చెందిన కాంగ్రెస్ ప్రముఖుడు, కళాబంధు టి. సుబ్బరామి రెడ్డి సాహచర్యం  కూడా  స్వామి స్వరూపానంద కు బాగా కలిసి వచ్చింది. శ్రీ  శారదాపీఠాన్ని ఒక స్వతంత్ర పీఠంగా రాష్ట్రం లో విస్తరించడానికి ఒక వైపు అవిశ్రావంతంగా కృషి చేస్తూనే, మరో వైపు తిరుమల లోనూ, ఇతర రాష్ట్రాలు, ప్రత్యేకించి... మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో తమ పీఠం వ్యవస్థలను పరిపుష్టం చేసుకున్న స్వామి స్వరూపానంద , తన తర్వాతి పీఠాధిపతి గా స్వామి స్వాత్మానందేంద్ర ను ప్రకటించిన విధానం కూడా ఆధ్యాత్మిక వాసులను విస్తుపోయేలా చేసింది. చంద్రబాబు నివాసానికి అతిదగ్గరలో, కృష్ణా నది   కరకట్ట మీద అంగ రంగ వైభవంగా జరిగిన ఆ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు -కె చంద్ర శేఖర్ రావు, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరవటమే కాకుండా, ఆ వేదిక మీదనే స్వామి స్వరూపానంద జగన్ మోహన్ రెడ్డి ని తన ఆత్మ గా అభివర్ణించటం, జగన్ నుదిటిని ముద్దాడటం కూడా రాజకీయ రంగ ప్రముఖులను విస్మయ పరిచింది. 

ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు  గరికపాటి చేసిన వ్యాఖ్యలతో స్వామి స్వరూపానంద శీల పరీక్ష కు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీ అధినేతనో, లేక ఆయన కు అత్యంత నమ్మకస్తుడైన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడో స్వామి ని  విమర్శించటమో,లేక ఆయనపై ఆరోపణలు చేయటమే జరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఏకంగా ఆధ్యాత్మిక రంగంలో లబ్ధ ప్రతిష్టులైన గరికపాటి లాంటి వారిని నేరుగా రంగం లోకి దింపటం ద్వారా -ఏ బీ ఎన్ మీడియా అధిపతి రాధాకృష్ణ చేసిన దాడిని స్వామి స్వరూపానంద ఎలా తిప్పికొడతారో వేచి చూడాలి.  ఎందుకంటే,స్వామి పీఠం లో ఆద్యాత్మికత ను ప్రశ్నించటం ద్వారా , పీఠ వ్యవస్థను నడి  రోడ్డు మీద నుంచో  పెట్టి అవమానించటానికే తెలుగుదేశం అనుకూల శక్తులు, ఈ రకమైన ఎత్తుగడలకు దిగుతున్నాయని స్వామి స్వరూపానంద అనుయాయుల వాదన. నిజానికి, కాస్త అటూ ఇటూగా ..స్వామి స్వరూపానంద తో సమానంగా పీఠం నెలకొల్పిన స్వామి పరిపూర్ణానంద కు ఎదురుకానంత వ్యతిరేకతను స్వరూపానంద మూట కట్టుకుంటున్నారు. ఇది తిరుగులేని వాస్తవం.